CDP - యత్నదోష అభ్యసన సిద్ధాంతం

1890లో విలియం జేమ్స్‌ రూపొందించిన Principles of Psychology అనే గ్రంథం చదివి ప్రభావితుడైన  అమెరికాకు చెందిన ఈ.ఎల్‌. థార్న్‌డైక్‌ అనే శాస్త్రవేత్త  1911లో Animal Intelligence అనే గ్రంథాన్ని ప్రచురించారు. అనేక తప్పులు చేయడం,  వాటిని సరిదిద్దుకోవడం ద్వారా అభ్యసనం జరగడాన్నే యత్నదోష అభ్యసనం అంటారు.  ప్రేరణ, ప్రతిస్పందనల మధ్య దృఢమైన బంధం ఏర్పడటం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. జంతువుల పై అనేక ప్రయోగాలు చేసి, 'భ్యసన ప్రక్రియను' ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధంగా వివరించారు.

అభ్యసన సిద్ధాంతాల్లో థార్న్‌డైక్‌ రూపొందించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి ఒక ప్రత్యేకత ఉంది.  ఈ సిద్ధాంతంలో ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య నాడీ సంధానం జరుగుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని సంసర్గ వాద సిద్ధాంతం/సంధానవాద సిద్ధాంతం/ఉద్దీపన-ప్రతిస్పందన సిద్ధాంతం/  బంధనాల సిద్ధాంతం/సుఖదుఃఖాల సిద్ధాంతం/S-R-Type  ప్రాధాన్యతసిద్ధాంతం, విజయ పథ వరణరీతి సిద్ధాంతంగా పేర్కొంటారు. 
ఈ సిద్ధాంతాన్ని విద్యాచరణలోనూ, శిక్షణా బదలాయింపులోనూ అధికంగా అన్వయిస్తారు.  ఈ  సిద్ధాంతం  ప్రకారం అభ్యసనం అనేది ప్రయత్నాలు చేయడం, దోషాలను అధిగమించడం ద్వారా జరుగుతుంది.
ఈయన ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే అనేక ప్రయత్నాలు చేయాలని, తద్వారా యత్నాల సంఖ్య పెరిగేకొద్దీ దోషాల సంఖ్య తగ్గి అభ్యసనంలో పట్టు సాధించడం జరుగుతుందని ప్రయోగపూర్వకంగా నిరూపించారు.  ఈయన  చేసిన ప్రయోగంలో పిల్లి అనేక ప్రయత్నాల ద్వారా విజయాన్ని పొందుతుంది. 
ప్రయోగం:

థార్న్‌డైక్‌ ఆకలిగా ఉన్న పిల్లిని  బోనులాంటి పజిల్‌బాక్స్‌  లో ఉంచి,    దానికి ఆవల కొద్ది దూరంలో  కనిపించేలా ఆహారాన్ని ఉంచారు.  పజిల్ పెట్టి తలుపు తెరుచుకోవాలంటే లోపల మీటను నొక్కాలి. బాక్స్‌కు అమర్చిన మీట నొక్కితే ఆహారం పిల్లికి అందేలా ఏర్పాటు చేశారు. పిల్లికి ఆకలి అనే అవసరం ద్వారా ప్రేరణకలగగా, అది తన ముందున్న ఆహారాన్ని పొందడానికి, బాక్స్‌లో నుంచి బయటికి రావడానికి అటూ ఇటూ తిరుగుతూ, తన పంజాతో కొట్టడం, పళ్లతో కొరకడం లాంటి అనేక వ్యర్థ ప్రయత్నాలను చేసింది. చివరకు అనుకోకుండా, యాదృచ్ఛికంగా మీటను తన పంజాతో నొక్కగానే తలుపు తెరుచుకోవడంతో పిల్లికి ఆహారం లభించింది. అంటే పిల్లి ఆహారాన్ని పొందే ప్రయత్నంలో చాలా తప్పులు చేసి, కొంతసమయాన్ని వృథా చేసి చివరకు ఆహారాన్ని పొందింది. పిల్లి మళ్లీ ఆహారాన్ని పొందే క్రమంలో ప్రయత్నాల సంఖ్య, ఆహారం పొందడానికి పట్టే సమయం కూడా తగ్గిపోయాయి.  ఈ విధంగా ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గి, తక్కువ కాలంలోనే విజయవంతంగా మీటను నొక్కి ఆహారాన్ని పొందడం అనేది అభ్యసనం ద్వారా జరుగుతుందని ఈ ప్రయోగం ద్వారా తెలుస్తోంది.
* ఈ ప్రయోగం ద్వారా అభ్యసించడానికి చలన కౌశలాలైన డ్రైవింగ్‌ (సైకిల్, స్కూటర్, కార్‌) ప్రక్రియ, ఈత నేర్చుకోవడం, క్రీడల్లో నైపుణ్యం పొందడం, చిన్నతనంలో పిల్లలు పలకపై అక్షరాలు దిద్ది నేర్చుకోవడం లాంటివి అనుకూలమైనవి.  ఈ అభ్యసన సిద్ధాంతం బోధనాభ్యాసన ప్రక్రియలో అభ్యాసం, డ్రిల్లు, పునరావృతాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 
థార్న్‌డైక్‌ ప్రయోగ అభ్యసన  ప్రధాన నియమాలు
ఈ ప్రయోగం ద్వారా థార్న్‌డైక్‌ మూడు ప్రధాన నియమాలను పేర్కొన్నారు.
1.సంసిద్ధతా నియమం  (Law of Readiness)
* ఈ నియమం ప్రకారం ఎవరిలోనైనా అభ్యసన ప్రక్రియ జరగాలంటే మొదట ‘సంసిద్ధత’ అవసరం. అదేవిధంగా పని  పరంగా గమనించినా ఏదైనా శారీరక, మానసిక చర్యలు జరపడానికి శారీరక పెరుగుదలతోపాటు మానసిక పెరుగుదల, పరిపక్వత అవసరం. ఈ ప్రక్రియ ప్రేరణపై కూడా ఆధారపడుతుంది.  అభ్యాసకుడు సంసిద్ధంగా లేకపోతే ఎన్నిరకాల అభ్యాసనా అనుభూతులను కల్పించినా కూడా ఫలితం ఉండదు. కొన్ని సందర్భాల్లో అభ్యసనం కూడా ప్రారంభం కాదు.  దీని కోసం ఉపాధ్యాయులు తరగతి గదిలో పాఠ్యబోధనకు ముందు రకరకాల ప్రేరణ కృత్యాలను నిర్వహించి విద్యార్థులను సంసిద్ధులను చేయాల్సి ఉంటుంది.  శిశుకేంద్ర విద్యకు అధిక ప్రాధాన్యం  ఇవ్వాలనుకునే   ఉపాధ్యాయులు సంసిద్ధతా నియమం తరగతిగదిలో  వినియోగించాలి.  దాహం లేని గుర్రాన్ని   
నీళ్ల తొట్టి  వద్దకు తీసుకెళ్లగలం కానీ దాంతో నీరు తాగించలేం కదా!
ఆభ్యాసకుడు శారీరకంగా, మానసికంగా సంసిద్ధుడుగా ఉన్నప్పుడు అభ్యసనానికి అనుమతించాలి.  శారీరకంగా, మానసికంగా అభ్యాసకుడు  అభ్యసించడానికి సిద్ధంగా లేనప్పుడు అభ్యసనానికి అనుమతించకూడదు.  ప్రయోగంలో పిల్లికి 'ఆకలిగా ఉండడం వల్ల పజిల్ బాక్స్ బయటికి రావడానికి సంసిద్ధంగా ఉంది. అభ్యాసకుడు అభ్యసనా కృత్యం చేయడానికి తగిన శారీరక, మానసిక పరిపక్వత ఉండాలి. అభ్యాసకుడికి అభ్యసనం పట్ల అభిరుచిని కలిగించాలి. అభ్యాసకుడు అభ్యసనం పట్ల అవధానం నిలపాలి. అభ్యాసకుడిలో ఉపాధ్యాయుడు అంతర్గత, బహిర్గత, సాధనా ప్రేరణ కలిగించాలి. అభ్యాసకుడి అవసరాలకు తగిన సిలబస్, కరికులమ్ ప్రవేశపెట్టాలి.  పాఠ్య పథకంలోని ప్రవేశిక చర్యలో భాగాలైన పూర్వజ్ఞానం పరిశీలించడం, ఉన్ముఖీకరణం, శీర్షికా ప్రకటన సంసిద్ధతా సుత్రానికి సంబంధించినవి. హెర్బర్ట్ బోధనా సోపానాలలో సన్నాహం' అనే సోపానం ఈ సంసిద్ధతా సూత్రంతో పోల్చవచ్చు.ఆ బోధనలో ఉన్ముఖీకరణ (మోటివేషన్) సోపానం అవసరం అనే విషయాన్ని తెలియజేస్తుంది.
2.అభ్యాస నియమం  (Law of Exercise)
 అభ్యసనంలో ‘అభ్యాస నియమం’ను  ప్రవర్తనా వాద సంప్రదాయం ఏర్పరచింది. ఒక కృత్యాన్ని మళ్లీ మళ్లీ చేయడమే అభ్యాసం. 
‘తినగ తినగ వేము తియ్యనుండు..  సాధనమున పనులు సమకూరు ధరలోన’, ‘అభ్యాసము కూసు విద్య’ అనే సామెతలు ఈ నియమానికి సంబంధించినవే. ఇందులో 2 ఉపనియమాలు ఉన్నాయి. 
A. ఉపయోగ/ తరచుదన /పౌనఃపున్య నియమం (Law of use): ఒక పనిని మళ్లీ మళ్లీ చేయడం ద్వారా దోషాలను నివారించి, అభ్యసనం సమర్థవంతంగా చేయవచ్చు. దీన్ని అనుసరించి ఎక్కాలు, పద్యాలు, శ్లోకాలు నేర్పించవచ్చు. క్రీడల్లో నైపుణ్యానికి కూడా ఈ ఉపనియమం అత్యంత ఉపయోగకరం.
B. నిరుపయోగ/ అనుపయోగ నియమం (Law of disuse): నేర్చుకున్న అంశాన్ని మళ్లీ మళ్లీ సాధన చేయకపోవడం వల్ల విషయం మధ్య సంధానం బలహీనపడి, అభ్యసనం కుంటుపడుతుంది. 
ఉదా: చిన్నతనంలో నేర్చుకున్న / అభ్యసించిన విషయాలు మళ్లీ మళ్లీ చదవకపోవడంతో వాటిని ప్రస్తుతం గుర్తుంచుకోలేకపోవడం.
గమనిక: చలన కౌశలాలకు ఈ నియమం వర్తించదు. 
ఉదా: ఈత, టైప్‌రైటింగ్, డ్రైవింగ్‌ లాంటి కౌశలాలను వెంటవెంటనే తిరిగి చేయకపోయినా, వాటిని పూర్తిగా మర్చిపోవడం జరగదు కానీ కొంత నిష్పాదన తగ్గవచ్చు.
3.ఫలిత నియమం (Law of Effect)
థార్న్‌డైక్‌ ఈ నియమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. దీన్ని రెండు ఉపనియమాలుగా పరిశీలిస్తే...
A. సంతృప్తి నియమం (Law of satisfaction): ఒక కృత్యసాధనలో మంచి ఫలితం లేదా సంతృప్తి ఏర్పడితే దాని మధ్య సంసర్గం బలపడుతుంది.
B. అసంతృప్తి నియమం (Law of Dissatisfaction): ఏదైనా ఒక కృత్యసాధనలో వైఫల్యం లేదా అసంతృప్తి కలిగితే వాటి మధ్య ఉన్న బంధనాలు బలహీనపడి అభ్యసనం సన్నగిల్లుతుంది లేదా క్షీణిస్తుంది.

Formative Tests -   Test-1

Comments

Popular posts from this blog

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

Prime & Composite Numbers

Why students hate maths?