CDP - Guidance & Counselling
I. మార్గదర్శకత్వం (Guidance):
వ్యక్తి తనలోని సామర్థ్యాలను గుర్తించి, తనకు తానే సహాయపడటానికి అందించే ఒక సహాయ ప్రక్రియనే మార్గదర్శకత్వం అంటారు.
స్కిన్నర్: ''మార్గదర్శకత్వం అంటే యువతీయువకులు తమలో తాము ఇతరులతో, పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ".
సెకండరీ విద్యా కమిషన్: మార్గదర్శకత్వమనేది బాలబాలికలకు వారు సాధించగలిగే సామర్థ్యాల దృష్ట్యా, అలాగే వారు పనిచేసుకోవాల్సిన ప్రపంచానికి సంబంధించిన కారకాల దృష్ట్యా, వారి భవిష్యత్‌ను తెలివిగా ప్రణాళికాబద్ధం చేసుకోవడానికి సహాయపడే క్లిష్టమైన పనితో కూడుకున్నది.
మార్గదర్శకత్వం - రకాలు: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఒకేషనల్ గైడెన్స్ (CBEVG), న్యూదిల్లీ మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించింది.
1) విద్యా సంబంధ మార్గదర్శకత్వం: ఇది విద్యార్థులకు విద్యకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
విద్యార్థులు నూతనంగా ఒక పాఠశాలలో చేరినప్పుడు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సర్దుబాటు, పాఠశాల పట్ల అయిష్టత ఉన్నా, పరీక్షలు సరిగా రాయక మార్కులు తగ్గినా ఈ రకమైన మార్గదర్శకత్వాన్ని కలిగించాలి.
2) ఔద్యోగిక మార్గదర్శకత్వం: పూర్వం అందరూ వంశపారంపర్య వృత్తులే చేసేవారు. కానీ ప్రస్తుతం అలా లేదు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు తగిన ఉద్యోగాన్ని ఎన్నుకుని దానిలో చేరి సఫలీకృతం కావడంలో ఈ మార్గదర్శకత్వం సహాయపడుతుంది. ఇది కేవలం వృత్తిని ఎన్నుకోవడానికి మాత్రమే కాకుండా వృత్తి నిర్వహణకు, ఆయా పరిసరాలతో సర్దుబాటు కావడానికి, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి తోడ్పడి వృత్తిలో సఫలతను, సంతృప్తిని సాధించడానికి తోడ్పడుతుంది.
3) వ్యక్తిగత మార్గదర్శకత్వం:
ఇది వ్యక్తుల సొంత విషయాలకు సంబంధించింది. దీని పరిధి విద్య, ఔద్యోగిక మార్గదర్శకత్వాల కంటే పెద్దది. ఇందులో విద్య, ఔద్యోగిక మార్గదర్శకత్వాలు భాగంగా ఉంటాయి. వ్యక్తి ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి ఇది ఉపయుక్తమైంది. అందరిలో కెల్లా కౌమార దశలోని వ్యక్తులకు ఇది అత్యంత ఉపయోగకరం.
II.మంత్రణం (Counselling)
మార్గదర్శకత్వం సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అవసరం. కానీ మంత్రణం కేవలం మూర్తి మత్వ సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రమే అవసరమైంది. అందుకే మార్గదర్శకత్వం మంత్రణం కంటే విస్తృతమైన భావన.
సహాయం అవసరమైన వ్యక్తిని, ఆ సహాయం అందించడానికి తగిన పరిజ్ఞానం, శిక్షణ పొందిన సలహాదారుడిని కలిపే ఒక పరస్పర చర్యా ప్రక్రియే మంత్రణం.
పెపిన్స్‌కీ: మంత్రణం అనేది ఒక క్లయింటు తన అవసరాలకు సంబంధించి సంతృప్తికరమైన తీర్మానాలు చేసుకోవడానికి అవసరమైన ప్రవర్తనా మార్పును చేసుకునేలా కౌన్సిలర్/ సలహాదారుడికి, క్లయింట్/ సహాయార్థికి మధ్య ఒక ప్రైవేట్ సిట్టింగ్‌లో జరిగే ప్రతిచర్య.
ఈ ప్రక్రియలో మంత్రణం చేసేవారిని కౌన్సిలర్/ మంత్రణకుడు అనీ, మంత్రణం పొందేవారిని కౌన్సిలీ/ క్లయింట్‌గా పేర్కొంటారు.
మంత్రణం - రకాలు: మంత్రణంలో కౌన్సిలర్ అనుసరించే విధానాన్ని బట్టి 3 రకాలను గుర్తించారు.
1. నిర్దేశిత మంత్రణం: ఈ మంత్రణాన్ని విలియంసన్ ప్రారంభించారు. కౌన్సిలర్, క్లయింట్ సమస్యను పూర్తిగా విని సరైన పరిష్కార మార్గాన్ని కనుక్కుని క్లయింట్ పాటించే విధంగా చేయడమే నిర్దేశిత మంత్రణం.
* ఈ ప్రక్రియలో క్లయింట్/ సహాయార్థి నిష్రియాత్మకంగా ఉండి, కౌన్సిలర్ క్రియాత్మకంగా ఉంటాడు.
* ఇందులో క్లయింట్ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉండదు.
ఉదా: 1) 10వ తరగతి విద్యార్థికి చదువు పట్ల సూచనలివ్వడం.
2) డిగ్రీ చేయాలనుకునేవారికి డీఎడ్‌లో చేరమని సలహా ఇవ్వడం.
2. అనిర్దేశిక మంత్రణం: ఈ మంత్రణాన్ని ప్రతిపాదించినవారు కార్ల్ రోజర్స్. దీన్ని సహాయార్థి మంత్రణం అని కూడా అంటారు. ఇది నిపుణులు మాత్రమే చేయగలిగే పద్ధతి. ఈ మంత్రణంలో కౌన్సిలీ చెప్పే విషయాన్ని కౌన్సిలర్ నైపుణ్యంతో విని, అవగాహన చేసుకుని, తగిన చర్యలను నిర్ణయించుకునేలా చేస్తారు. ఈ ప్రక్రియలో సహాయార్థి పాత్రే అధికంగా ఉంటుంది.
* ఇందులో కౌన్సిలర్ నిష్క్రియాత్మకంగా, కౌన్సిలీ క్రియాత్మకంగా ఉంటారు.
* కౌన్సిలీ సౌకర్యకర్తగా లేదా సహాయకారిగా మాత్రమే ఉంటారు.
* ఈ కౌన్సిలింగ్... తక్షణ సమస్య కంటే వ్యక్తిని మార్చడానికి సహాయపడుతుంది.
3. శ్రేష్ఠగ్రహణ/ మిశ్రమ/ దార్శినిక మంత్రణం:
ఎఫ్.సి. థార్న్ దీన్ని ప్రతిపాదించారు. నిర్దేశిక, అనిర్దేశిక మంత్రణాల్లో ఏదో ఒకదానికి పరిమితం కాకుండా సమస్య స్వభావం, తీవ్రత, పరిస్థితి, సహాయార్థి తక్షణ అవసరం, మూర్తిమత్వం ఆధారంగా అవసరాన్ని బట్టి రెండు మంత్రణ పద్ధతులను ఉపయోగించడాన్ని శ్రేష్ఠగ్రహణ మంత్రణం అంటారు.
* కౌన్సిలీ, కౌన్సిలర్ ఇద్దరూ క్రియాత్మకంగా ఉంటారు.
* ఈ మంత్రణాన్ని ముఖ్యంగా కౌమారుల సమస్యా పరిష్కారానికి అధికంగా ఉపయోగిస్తారు.
* ఈ మంత్రణంలో వాడే విధానాలు ముఖ్యంగా
1) సూచన 2) సలహా 3) సమ్మతింపజేయడం 4) వ్యాఖ్యానించడం
మంత్రణంలో ఉపయోగించే పద్ధతులు:
1) ఇంటర్వ్యూ 2) చెక్‌లిస్టులు 3) మనోవైజ్ఞానిక పరీక్షలు
Comments
Post a Comment