Indian Geography - Wild-life

వైవిధ్యభరిత వన్యప్రాణులు విస్తృతంగా ఉన్న దేశం భారత్‌. ఇక్కడ మాత్రమే జీవించే ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. ఆసియాటిక్‌ సింహాలు, రాయల్‌ బెంగాల్‌ పులులు, ఒంటికొమ్ము ఖడ్గమృగాలు, ఏనుగులు, చిరుతలు, మొసళ్లు, సరీసృపాలు, పక్షిజాతులు తదితర వన్యప్రాణులన్నీ దేశ సహజ వారసత్వ సంపదగా వర్థిల్లుతున్నాయి. పర్యావరణ సమతౌల్యానికే కాకుండా పర్యాటకానికి కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ వన్యప్రాణులు, వాటి సహజ ఆవాసాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. పర్యావరణ వ్యవస్థలను, వన్యప్రాణులను సంరక్షించేందుకు ఏర్పాటైన జాతీయ పార్కులు, అభయారణ్యాలు, ప్రాజెక్ట్‌ టైగర్‌ తరహా ప్రత్యేక విధానాలు, వాటి పరిధి, ఫలితాలను సమగ్రంగా తెలుసుకోవాలి.
వన్యప్రాణులు
దేశంలోని భౌగోళిక భిన్నత్వం, విభిన్న వాతావరణ పరిస్థితులు, పర్యావరణ వైవిధ్యం నేపథ్యంలో వివిధ అడవి జంతువులు, పక్షులు, కీటకాలకు సహజ ఆవాసాలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలోని మొత్తం జంతు జాతుల్లో (15 లక్షలు) దేశంలో సుమారు 6.7% (81,251) రకాలు ఉన్నాయి.
బ్రిటిష్‌ ప్రకృతి శాస్త్రవేత్త ఎస్‌.హెచ్‌.ప్రేటర్‌ (1934) ప్రకారం భారతదేశాన్ని ఆరు జంతు- భౌగోళిక ప్రాంతాలుగా విభజించవచ్చు. 1) హిమాలయ ప్రాంతం 2) ఉత్తర మైదానాలు 3) థార్‌ ఎడారి 4) ద్వీపకల్ప పీఠభూమి 5)   మలబార్‌ తీరం 6) నీలగిరి ప్రాంతం.
దేశంలో మొత్తం 45,000 వృక్షజాతులు, 1200 రకాల పక్షులు, 453 రకాల సరీసృపాలు, 350 రకాల క్షీరదాలు ఉన్నాయి. వీటితోపాటు 13,000 రకాల సీతాకోకచిలుకలు, దాదాపు 50,000        క్రిమికీటకాలు జీవిస్తున్నాయి. ఈ వన్యప్రాణులు దేశ సహజవారసత్వ సంపద. ఇంత అద్భుతమైన జీవవైవిధ్యానికి కారణం దేశం ఎన్నో శతాబ్దాలుగా సంరక్షించి కాపాడుకుంటూ వస్తున్న పర్యావరణ వ్యవస్థ, దాని వైవిధ్యం. అయితే వివిధ మానవ కార్యకలాపాల వల్ల వాటి సహజ ఆవాసాలు చెదిరిపోయి, వాటి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.   ఔషధాలు, సుగంధద్రవ్యాల్లో ఉపయోగించడం కోసం పెద్ద పిల్లులు, పులులు, ఖడ్గమృగాలు, కస్తూరి జింకలను నిరంతరాయంగా వేటాడుతుండటం, అక్రమ రవాణా చేస్తుండటంతో వాటి సంఖ్య తగ్గిపోతోంది.
కేంద్రం 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఆమోదించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో 1,75,169 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న వివిధ పెద్ద భూభాగాలను (సుమారు 5.32%) జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాలు, సంరక్షణ కేంద్రాలు, కమ్యూనిటీ అభయారణ్యాలుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 107 జాతీయ పార్కులు, 573 అభయారణ్యాలు ఉన్నాయి. జాతీయ జీవవైవిధ్య చట్టం (2002) అంతరించిపోతున్న జాతుల రక్షణ, వాటి ఆవాసాలను నిర్ధారిస్తుంది. వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా లాంటి నేరాలను వైల్డ్‌లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) పర్యవేక్షిస్తుంది.
దేశంలో అంతరించిపోతున్న జంతుజాతులను తిరిగి అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్‌ టైగర్‌ (1973), ప్రాజెక్ట్‌ క్రోకోడైల్‌ బ్రీడింగ్, రైనోసార్‌ ప్రాజెక్ట్‌ (1987); ప్రాజెక్ట్‌ స్నోలెప£ర్డ్, ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌ (1992) తదితరాలను ప్రారంభించారు.
వన్యపాణుల సంరక్షణ: భారత్‌లో వివిధ రకాల పర్యావరణ వ్యవస్థలు, ఆవాసాలు ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా కనిపించని, అంతరించిపోతున్న అడవి మొక్కలు, జంతువులు ఇక్కడ ఉంటాయి. వాటిలో కొన్నింటిని రక్షించడానికి జాతీయ పార్కులు, అభయారణ్యాల లాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జాతీయ పార్కులు: ప్రత్యేక  పర్యావరణ వ్యవస్థ ఉన్న పెద్ద ప్రాంతాన్ని జాతీయ పార్కుగా పేర్కొంటారు. అది భౌతిక మార్పులకు గురికాకుండా, మనుషులు ఆక్రమించకుండా, అక్కడి నుంచి జంతువుల అక్రమ రవాణా జరగకుండా చూస్తారు. శాస్త్రీయ అధ్యయనం, విజ్ఞానం, వినోదం కోసం వృక్ష, జంతు జాతులు, భౌగోళిక స్వరూప ప్రాంతాలు, ఆవాసాలను సృష్టిస్తారు. వీటిలో మనుషుల ప్రవేశానికి అనుమతి లేదు. ఈ తరహా పర్యావరణ వ్యవస్థలో హిమాలయ జాతీయ పార్కు అతిపెద్దది. ఇక్కడ మంచు చిరుతల ఆవాసం ప్రత్యేకమైంది. హిమాలయ టెరాయ్‌ ప్రాంతంలోనూ జాతీయ పార్కులు ఉన్నాయి. ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన కజిరంగా జాతీయ పార్కులో అనేక రకాల పక్షులు, బాతులు, పెలికాన్లు, ఏనుగులు, అడవి పందులు, జింకలు, పులులు, చిరుత పులులు ఉన్నాయి. మానస్‌ అభయారణ్యంలో   అరుదైన బంగారు లంగూర్, పిగ్మీహగ్‌లు ఉన్నాయి. థార్‌ నేషనల్‌ పార్కు కూడా ఈ తరహాలోనిదే.
అభయారణ్యాలు: వీటిని కూడా జాతీయ పార్కుల మాదిరి వన్యప్రాణులను రక్షించడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేక జంతుజాతులను సంరక్షిస్తారు. వీటిలోకి మనుషుల ప్రవేశానికి అనుమతి ఉంటుంది. ఇవి జాతీయ సంపదను, జీవవైవిధ్యాన్ని భౌతికంగా సంరక్షించడమే కాకుండా భవిష్యత్తు తరాలకు సహజ పర్యావరణాన్ని భద్రంగా అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి డెల్టాలో ఉన్న కోరింగ వన్యప్రాణి అభయారణ్యం మడ అడవులకు ప్రసిద్ధి. ఇక్కడ 120కి పైగా పక్షి జాతులు ఉన్నాయి. నంద్యాల జిల్లాలోని రోళ్లపాడు వన్యప్రాణి అభయారణ్యంలో అరుదైన పక్షులు, చిలుకలు, కుందేళ్లు ఉన్నాయి. తిరుపతి సమీపంలోని వేంకటేశ్వర వన్యప్రాణి అభయారణ్యం సీస జింకలు, చిరుతలు, పులులు తదితరాలకు నివాస ప్రాంతం. తెలంగాణ- ఆంధ్ర సరిహద్దులోని నల్లమల వన్యప్రాణి అభయారణ్యం నాగార్జునసాగర్‌ - శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌లో ముఖ్య భాగం. ఇక్కడ చిరుతలు, పులులు, సాంబర్, అడవి పందులు, కలిమిలు ఉంటాయి. వరంగల్‌ సమీప ఏటూరి నాగారం వన్యప్రాణి అభయారణ్యంలో అరుదైన చిరుతలు, అడవి జంతువులు కనిపిస్తాయి. గుజరాత్‌లోని గిర్‌ అడవుల్లో సింహాలు, చిరుతలు, నక్కలు ఎక్కువగా ఉంటాయి. బెంగాల్‌లోని సుందర్బన్‌ అభయారణ్యం రాయల్‌ బెంగాల్‌ పులులకు ప్రసిద్ధి.
పులుల సంరక్షణ కేంద్రాలు: భారతదేశంలో పులుల సంరక్షణ మొదటి దశ 1970లో ప్రారంభమైంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ద్వారా పులుల అటవీ సురక్షిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. రెండో దశ (2005-06)లో క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా పులుల సంరక్షణ చర్యలు, వాటి రక్షణకు కఠిన విధానాలను రూపొందించారు. ఫలితంగా పులుల సంఖ్య 2006లో 1,411 నుంచి 2018 నాటికి 2,967కి పెరిగింది.
జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్‌టీసీఏ) 2023, జులైలో చేసిన ప్రకటన ప్రకారం 2022 నాటికి దేశంలో 3,682 పులులు ఉన్నాయని అంచనా. ఇది ప్రపంచ పులుల జనాభాలో 75%. ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ మధ్యలో ఉన్న ‘నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌’ దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. దీని వైశాల్యం 3,261 చ.కి.మీ.లు. మహారాష్ట్రలోని బోర్‌ టైగర్‌ రిజర్వ్‌ అతిచిన్నది. దీని వైశాల్యం 138 చ.కి.మీ.లు. దేశంలో 2014, జులై నాటికి 47 టైగర్‌ రిజర్వ్‌లు ఉండగా, 2024 నాటికి 55కి చేరింది. 2024లో కొత్తగా రాజస్థాన్‌లో ‘దోల్‌పుర్‌- కరౌలి టైగర్‌ రిజర్వ్‌’ ఏర్పాటైంది.
ముఖ్యాంశాలు
ప్రపంచంలోని మొత్తం జంతు జాతుల్లో దేశంలో 6.7% ఉంది.
దేశంలో మొదటి వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 1972లో చేశారు.
ప్రస్తుతం దేశంలో జాతీయ పార్కులు 107, అభయారణ్యాలు 573.
దేశంలో అతి పురాతన జాతీయ పార్కు జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ను 1936లో ఉత్తరాఖండ్‌లో ఏర్పాటు చేశారు.
వన్యప్రాణుల రక్షణ, అక్రమ రవాణా నిరోధాన్ని వైల్డ్‌ లైఫ్‌ కంట్రోల్‌ బ్యూరో  (డబ్ల్యూసీసీబీ) పర్యవేక్షిస్తుంది.
పులుల సంరక్షణ కోసం 1973లో ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ ప్రారంభించారు.
బెంగాల్‌లోని సుందర్బన్‌ అభయారణ్యం రాయల్‌ బెంగాల్‌ పులులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
అత్యధిక జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌ (11)
‘గిర్‌’ అడవులు గుజరాత్‌లో ఉన్నాయి.
మంచు చిరుతలు గ్రేట్‌ హిమాలయన్‌ నేషనల్‌ పార్కులో ఉన్నాయి.
దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం నల్లమల అడవిలోని  నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌. 

Comments

Popular posts from this blog

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ( Educational Psychology ) - Practice

Prime & Composite Numbers

Why students hate maths?