Industrial Policy
ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో లభించే వనరులను అభిలషనీయంగా ఉపయోగించుకోవాలి. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అందుకు ఉత్పత్తి ప్రక్రియలో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల పాత్రను వివరించాలి. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల పాత్ర, దేశీ, విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన వాటి విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందనేది ఆ దేశ పారిశ్రామిక విధానంలో వివరంగా ఉంటుంది. స్వాతంత్య్రానంతరం దేశంలో సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వాలు కొత్త పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చాయి.
పారిశ్రామికాభివృద్ధిని పరుగులెత్తించేందుకు కాలానుగుణంగా మార్పులతో పారిశ్రామిక తీర్మానాలను తీసుకొచ్చాయి. గ్రూప్స్ పరీక్షల సిలబస్‌లోని దేశ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థల విభాగంలో భారత పారిశ్రామిక విధానాలు కూడా కీలకమైనవి. గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పారిశ్రామిక తీర్మానాలపై అవగాహన తప్పనిసరి. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకులకోసం..
భారతదేశం-పారిశ్రామిక విధానం
-స్వాతంత్య్రానికి పూర్వం దేశానికి సరైన, కచ్చితమైన పారిశ్రామిక విధానమంటూ
లేదు. స్వాత్రంత్య్రానంతరం భారత ప్రభుత్వం పారిశ్రామిక విధానం ఆవశ్యకతను
గుర్తించి 1948, ఏప్రిల్ 6న మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని
ప్రకటించింది.
-1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల
పరిధిని స్పష్టంగా పేర్కొంటూ పరిశ్రమలను నాలుగు వర్గాలుగా విభజించారు. ఈ
తీర్మానం మూలంగా దేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది.
-మొదటి వర్గంలోని పరిశ్రమలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలోనే ఉంటాయి. 1)
దేశరక్షణ, తత్సంబంధ పరిశ్రమలు, ఆయుధ సామగ్రి, ఆయుధాల ఉత్పత్తి, నియంత్రణ.
2) అణుశక్తి ఉత్పత్తి, నియంత్రణ. 3) రైల్వేలు, వాటి నిర్వహణ, యాజమాన్యం,
వీటి నిర్వహణ పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత.
2రెండో వర్గంలో ఆరు కీలక, మౌలిక పరిశ్రమలను చేర్చారు. 1) బొగ్గు, 2) ఇనుము, ఉక్కు, 3) విమానాల ఉత్పత్తి,
4) నౌకానిర్మాణం, 5) టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్‌లెస్ పరికరాల ఉత్పత్తి,
6) ఖనిజపు నూనెలు. ఈ వర్గంలోని పరిశ్రమలను కొత్తవాటిని ప్రయివేటు రంగంలో
స్థాపించడానికి వీలు లేదు. ఇప్పటినుంచి వీటిని ప్రభుత్వ రంగంలోనే
స్థాపిస్తారు. అప్పటికే ప్రయివేటు రంగంలో ఉన్న వాటిని కొనసాగించ వచ్చు.
కానీ అవసరమనుకుంటే పదేండ్ల తర్వాత నష్టపరిహారం చెల్లించి వాటిలో దేన్నైనా
ప్రభుత్వం జాతీయం చేయవచ్చు.
-మూడో వర్గంలో జాతీయ ప్రాముఖ్యం ఉన్న పరిశ్రమలను చేర్చారు. వీటిని
ప్రభుత్వం నిర్వహించనప్పటికీ వీటి నియంత్రణ, అజమాయిషీ ప్రభుత్వానికి
ఉంటుంది. అందువల్ల వీటి ఉత్పత్తులు ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడి
కొనసాగుతాయి.
-పై మూడు వర్గాల్లో లేని పరిశ్రమలను నాల్గో వర్గంలోకి చేర్చారు. వీటిపై ప్రభుత్వం సాధారణ అజమాయిషీ కలిగి ఉంటుంది.
-1951 లో పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం- పరిశ్రమల అభివృద్ధి క్రమబద్ధ
చట్టం రూపొందించారు. ఈ చట్టం 8-5-1952 నుంచి అమల్లోకి వచ్చింది.
రెండో పారిశ్రామిక విధానం
-1956, ఏప్రిల్ 30 న భారత ప్రభుత్వం రెండో పారిశ్రామిక విధాన తీర్మానాన్ని
ప్రకటించింది. 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మాన కాలం నుంచి 1956
నాటికి మనదేశంలో అనేక రాజకీయ, ఆర్థిక మార్పులు వచ్చాయి. 1950లో ప్రాథమిక
హక్కులు, ఆదేశిక సూత్రాలతో కూడిన రాజ్యాంగం రూపొందడం, 1956 నాటికి మొదటి
పంచవర్ష ప్రణాళికను పూర్తిచేసుకోవడం, రెండో పంచవర్ష ప్రణాళికలో భారీ, మౌలిక
పరిశ్రమలకు ప్రాధాన్యతనివ్వడం, సామ్యవాదరీతి సమాజ స్థాపన లక్ష్యంగా
నిర్ణయించుకోవడం మొదలైనవి 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకటించడానికి
కారణమయ్యాయి. ఈ తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగం గా పేర్కొంటారు. ఇందులో
పరిశ్రమలను స్పష్టంగా, నిర్దిష్టంగా విభజించింది. ప్రభుత్వ రంగానికి అధిక
ప్రాధాన్యతనిచ్చి సామ్యవాదరీతి సమాజ స్థాపనకు పునాదులు వేసింది.
-1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను అ, ఆ, ఇ అనే మూడు జాబితాలుగా వర్గీకరించారు.
-అ జాబితాలో 17 పరిశ్రమలను చేర్చారు. దేశ రక్షణ, తత్సంబంధమైన పరిశ్రమలు
దీనిలో ఉన్నాయి. వీటిలో 1. ఆయుధాలు 2. అణుశక్తి 3. విమాన రవాణా 4. రైల్వే
రవాణా మొదలైన నాలుగు రకాల పరిశ్రమలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉంటాయి.
మిగతా 13 పరిశ్రమలను ఇప్పటినుంచి ప్రభుత్వమే స్థాపిస్తుంది. అప్పటికే
ప్రయివేటు రంగంలో ఉన్నవి అలాగే కొనసాగవచ్చు. అవసరమనుకుంటే వీటిని ప్రయివేటు
రంగంలో కూడా నెలకొల్పే అవకాశం కల్పించింది. ఈ తీర్మానంలో పరిశ్రమలను
జాతీయం చేసే ప్రతిపాదన లేదు.
-ఆ జాబితాలో 12 పరిశ్రమలను చేర్చారు. అన్ని రకాల ఖనిజాలు, లోహాలు, యంత్ర
పనిముట్లు, మిశ్రమ లోహాలు, ఎరువులు, రబ్బరు, బొగ్గు మొదలైన పరిశ్రమలను
ఇందులో చేర్చారు. ఈ పరిశ్రమల్లో ప్రభుత్వం ఇతోధికంగా నూతన సంస్థలను
స్థాపించి తన భాగస్వామ్యాన్ని పెంచుకోవచ్చు. అయితే ప్రయివేటు రంగం కొత్త
సంస్థలను స్థాపించడానికి గాని, ఉన్నవాటిని విస్తృతం చేసుకోవడానికి ఏ
ఇబ్బంది, ఆటంకం ఉండదు.
-అ, ఆ జాబితాల్లో లేని పరిశ్రమలను ఇ జాబితాలో చేర్చారు. ఈ జాబితాలోని
పరిశ్రమల అభివృద్ధి, ప్రయివేటు రంగం చొరవపై ఆధారపడి ఉంటుంది.
పారిశ్రామికీకరణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ జాబితాలోని పరిశ్రమలను ప్రభుత్వం
ప్రోత్సహించడమే కాకుండా నియంత్రిస్తుంది.
-1970, 1973, 1975ల్లో పారిశ్రామిక విధాన తీర్మానాలను ప్రకటించినప్పటికీ ఆ
తీర్మానాలు 1956 తీర్మానాన్ని ప్రాతిపదిక చేసుకుని రూపొందాయి. వాటిలో
మౌలికమైన మార్పులు లేకుండా కేవలం కుటీర, చిన్నతరహా పరిశ్రమల నిర్వచనాల్లో,
లైసెన్సింగ్ విధానంలో, విదేశీ మూలధన విషయంలో చిన్న చిన్న మార్పులు చేశారు.
-1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 1977 డిసెంబర్, 23న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ తీర్మానాన్ని గాంధేయ విధానానికి అనుగుణగా రూపకల్పన చేశారు. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతను కల్పించారు. 50,000 జనాభా కంటే తక్కువ ఉన్న పట్టణాల్లో రూ. లక్ష పెట్టుబడి పరిమితి ఉన్న పరిశ్రమలను Tiny Industriesగా పేర్కొన్నారు. చిన్న పరిశ్రమల పెట్టుబడి పరిమితిని రూ. 10 లక్షలకు, అనుబంధ పరిశ్రమల పెట్టుబడి పరిమితిని రూ. 15 లక్షలకు పెంచారు. చిన్న పరిశ్రమల జాబితాను 180 నుంచి 807కు పెంచారు. జనతా పారిశ్రామిక విధానంలో చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు.
నూతన పారిశ్రామిక విధానం
-భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం చేసి విదేశీ
పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రసామగ్రి దిగుమతులను పెంచి
వేగవంతమైన అభివృద్ధిని సాధించడం, 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం
ప్రధానోద్దేశం పి.వి.నర్సింహారావు ప్రధాన మంత్రిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక
మంత్రిగా 1991 జాలై, 24న నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకటించింది.
సరళీకరణ (Liberalisation), ప్రయివేటీకరణ (Privatisation), ప్రపంచీకరణ
(Globalisation), LPG లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో పెను
మార్పులకు శ్రీకారం చుట్టింది.
-1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో మొదటగా 18 పరిశ్రమలను తప్పించి
మిగతా అన్ని పరిశ్రమలను లైసెన్సింగ్ పరిధి నుంచి మినహాయించారు. తర్వాత
వీటిని
1. ఆల్కహాల్ 2. సిగరెట్స్ 3. హానికర రసాయనాలు 4. రక్షణ సామగ్రి 5.
పారిశ్రామిక పేలుడు పదార్థాలు 6. డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ మొదలైన 6
పరిశ్రమలకు తగ్గించారు.
-1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో అ జాబితాలో ఉన్న 17 పరిశ్రమలను,
1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో మొదటగా 8 పరిశ్రమలకు కుదించారు. 1993లో
వీటి సంఖ్యను 6 పరిశ్రమలకు, 2001 నాటికి 3 పరిశ్రమలకు పరిమితం చేశారు. 1.
అణుశక్తి, 2. అణుశక్తి కోసం ఉపయోగించే ఖనిజాలు, 3. రైల్వే రవాణా.
-1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో MRTP (Monopolies Restrictive Trade
Practices) చట్ట పరిధిని కుదించారు. పెద్ద సంస్థలు నూతన సంస్థలను
స్థాపించుకోవడానికి, ఉన్న సంస్థలను విస్తరించుకోవడానికి ఉన్న అంక్షలను ఈ
తీర్మానంలో తొలగించారు.
-1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో విదేశీ పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష
పెట్టుబడులపైన ఉన్న అనేక ఆంక్షలను సడలించడమే గాకుండా ఎగుమతులు, దిగుమతులపై
విధించే పన్నులను కూడా సడలించారు.
-1991 పారిశ్రామిక విధాన తీర్మానానికి అనుగుణంగా 1991 డిసెంబర్‌లో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణను చేపట్టింది.
-1991-92 ఇంటీరియమ్ బడ్జెట్‌లో 20% ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ఉపసంహరించాలని పేర్కొంది.
-1993, ఏప్రిల్‌లో రంగరాజన్ కమిటీ 49% ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ఉపసంహరించాలని సిఫార్సు చేసింది.
-పెట్టుబడుల ఉపసంహరణ కోసం పరిశ్రమల మంత్రిత్వశాఖ 1996, అగస్టు 23న
జి.వి.రామకృష్ణ ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
-పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహణ, సమీక్షకుగాను 1999, డిసెంబర్‌లో ప్రభుత్వం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.
-1973లో తెచ్చిన విదేశీ మారక క్రమబద్ధీకరణ చట్టం (FERA- Foreign
Exchange Regulation Act)ను జనవరి 1, 1974న అమల్లోకి తెచ్చారు. దాదాపు 26
ఏండ్ల పాటు కొనసాగిన ఫెరా స్థానంలో సరళీకృత విధానానికి అనువుగా విదేశీ మారక
నిర్వహణ చట్టాన్ని (FEMA- Foreign Exchange Management Act) 1999లో
తెచ్చారు. ఈ చట్టం 2000, జూన్ 1న అమల్లోకి వచ్చింది.
-ప్రభుత్వ కంపెనీలు స్వయం ప్రతిపత్తితో పని చేయడానికి వీలుగా వాటిని మూడు
రకాల కేటగిరీలుగా వర్గీకరించారు. 1. మహారత్న 2. నవరత్న 3. మినీరత్న
మహారత్న కంపెనీలు
-2014 అక్టోబర్ 26 నాటికి మహారత్న హోదా కలిగిన ప్రభుత్వ కంపెనీలు ఏడు. అవి
1) కోల్ ఇండియా లిమిటెడ్, 2) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3)
నేషనల్ థర్మల్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, 4) ఆయిల్ అండ్ నేచురల్
గ్యాస్ లిమిటెడ్, 5) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 6) భారత్ హెవీ
ఎలక్ట్రికల్ లిమిటెడ్ 7) గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ హోదా
పొందడానికి మూడేండ్లు వరుసగా రూ. 2,500 కోట్ల నికర లాభం, రూ. 10,000 కోట్ల
నికర పెట్టుబడులతో పాటు, అవి రూ. 20,000 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలి. ఇవి
రూ. 1000 కోట్ల పెట్టుబడిని గాని ఏదేని ఒక ప్రాజెక్టుపై తన నికర
పెట్టుబడుల్లో 15% సమకూర్చుకోవడానికి స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి.
-2014 అక్టోబర్ 26 నాటికి నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ కంపెనీలు 17. 1) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 2) భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ 3) కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 4) ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ 5) హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 6) హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 7) మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ 8) నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ 9) నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ 10) నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 11) నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ 12) ఆయిల్ ఇండియా లిమిటెడ్ 13) పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 14) పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 15) రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 16) రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 17) షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
నవరత్న హోదాను పొందడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ 6
పారామితులైన నికర లాభం, నికర పెట్టుబడి, శ్రమపై అయ్యే వ్యయం, మూలధనానికి-
PBDIT (Profit Before Depreciation, Interest and Taxes), టర్నోవర్ –
PBDIT, వాటా ఆర్జన (Earnings Per Share), కంపెనీ అంతర్గత భాగాల మధ్య
సమన్వయంతోపాటు అది అప్పటికే మినీరత్న హోదాను పొంది ఉండి 100 స్కోరుకు గాను
60 స్కోరు పొందాలి.
-మినీరత్న హోదా కేటగిరీ ఐ కేటగిరీ ఐఐ కలిగిన ప్రభుత్వ కంపెనీల సంఖ్య
మొత్తం73. ఇందులో కేటగిరీ ఐ కు సంబంధినవి 56 కాగా, కేటగిరీ ఐఐ కు సంబంధినవి
17 ఉన్నాయి.
Comments
Post a Comment